ప్రతి జర్నలిస్టుకూ సొంతింటి స్థలంతో పాటు బీమా సౌకర్యం...మంత్రి ముత్తంశెట్టి హామీ.. ఘనంగా ఏపీ న్యూస్‌పేపర్స్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ నేత జీవీ సంస్మరణ సభ

ప్రతి జర్నలిస్టుకూ సొంతింటి స్థలంతో పాటు బీమా సౌకర్యం
హౌసింగ్‌ సైట్స్‌ సమస్య పరిష్కారానికి కృషి
మంత్రి ముత్తంశెట్టి హామీ.. 
ఘనంగా ఏపీ న్యూస్‌పేపర్స్‌ ఎంప్లాయిస్‌
ఫెడరేషన్‌ నేత జీవీ సంస్మరణ సభ
నివాళులర్పించిన జర్నలిస్టు సంఘాల నేతలు
(విశాఖపట్నం,నిజం న్యూస్)
 ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టు హౌసింగ్‌ సైట్స్‌ సమస్య పరిష్కారానికి వీలైనంత వేగంగా కృషి చేస్తామని  రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు హామీనిచ్చారు.  ప్రతీ జర్నలిస్టుకు సొంతింటి స్థలంతో పాటు బీమా సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. వైజాగ్‌ జర్నలిస్ట్‌ ఫోరం(వీజేఎఫ్‌) ఆధ్వర్యంలో ఏపీ న్యూస్‌పేపర్స్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఉపాధ్యక్షులు, శ్రీ సాయి ప్రభ సేవా ట్రస్ట్‌ వ్యవస్థాపకులు గరికిపాటి వెంకటేశ్వరరావు(జీవీ) నాల్గవ వర్ధంతి సభను నార్ల వెంకటేశ్వరభవన్‌లో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ముత్తంశెట్టి చేతుల మీదుగా నాటకరంగ కళాకారులకు ఆర్థిక చేయూతతో పాటు నిత్యావసర వస్తువులు, మాస్కులు, శానిటైజర్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జీవీ పోరాట స్ఫూర్తి నేటి తరాలకు ఆదర్శమని, ఆయన అడుగు జాడల్లో నడుస్తూ విలేకర్ల సమస్యల పరిష్కారానికి జర్నలిస్టు సంఘాలు, ప్రభుత్వాలు పని చేయాలని సూచించారు మనిషికున్న చిన్న జీవితంలో చేసే సేవే భావితరాలకు చిరస్థాయిగా నిలుస్తుందని, అటువంటి స్ఫూర్తి ప్రదాత దివంగత గరికిపాటి వెంకటేశ్వరరావు అని పేర్కొన్నారు. సమాజాభివృద్ధికి, తోటి వారికి మంచి చేయాలంటే పదవి, హోదా అవసరం లేదని నిరూపించిన మహనీయ వ్యక్తి జీవీ అని గుర్తు చేశారు. . ప్రస్తుతం సమాజంలో వైట్‌కాలర్‌ వేసుకున్న నిరుపేద జర్నలిస్టు అని, అటువంటి వారి సంక్షేమానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.. రైటర్స్‌ అకాడమి ఛైర్మన్, లీడర్‌ దినపత్రిక ఎడిటర్‌ వి.వి.రమణమూర్తి మాట్లాడుతూ జీవీ వంటి మహనీయుడి గురించి గుర్తు చేసుకోవడం సంతోషంతో ఉందన్నారు. జీవీలాంటి యూనియన్‌ నాయకులు ప్రస్తుతం లేరని, ఆయన జర్నలిస్టులకు ఎటువంటి చిన్న సమస్య వచ్చినా యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేసిన వ్యక్తి అన్నారు. సీనియర్‌ పాత్రికేయుడు ఎం.యుగంధర్‌రెడ్డి మాట్లాడుతూ జీవీతో సాన్నిహిత్యం ఉండడం గర్వంగా ఉందన్నారు. నాన్‌ జర్నలిస్టు అయినప్పటికీ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేసిన మహనీయ వ్యక్తి అని పేర్కొన్నారు. ఆయన అడుగుజాడల్లో జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు నడిచి విలేకర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సభాధ్యక్షత వహించిన వీజేఎఫ్‌ ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ జర్నలిస్టు నేతగా జీవీ చేసిన పోరాటాలను గుర్తు చేశారు. ప్రతికా రంగంలో చాలా మందికి జీవితాన్ని ప్రసాదించిన వ్యక్తి జీవీ అన్నారు. సౌమ్యూడిగా, సున్నిత మనసు కలిగిన జీవీ జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో మాత్రం సింహంలా పోరాటం చేసేవారని చెప్పారు. అనంతరం జీవీ ప్రస్థానంపై, చేసిన పోరాటాలపై ప్రజా కవి దేవి శ్రీ రచించి పాట రూపంలో ఆలపించారు.  కార్యక్రమంలో జీవీఎంసీ యూసీడీ పీడీ యాదగిరి శ్రీనివాసరావు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ సాంస్కృతిక విభాగం నగర అధ్యక్షుడు మారుతీ ప్రసాదరావు, వీజేఎఫ్‌ కార్యదర్శి దుర్గారావు, జర్నలిస్టుల సంఘం ప్రతినిధులు పి.నారాయణ, ఆర్‌.రామచంద్రరావు, ఆర్‌ నాగరాజ్‌ పట్నాయక్, ఇరోతి ఈశ్వరరావు, పి.సత్యనారాయణ, దాడి రవికుమార్, డి.రవికుమార్, జి.సాంబశివరావు, వరలక్ష్మి, ఇతర జర్నలిస్టులు, కళాకారులు పాల్గొన్నారు.
–––––––––––––