జర్నలిజం ప్రమాణాల పెంపుదలకు ఐజెయు కృషి

జర్నలిజం ప్రమాణాల పెంపుదలకు ఐజెయు కృషి
మంగళగిరి, మార్చి 4 ,నిజం న్యూస్ : జర్నలిజంలో నాణ్యతా ప్రమాణాలు మెరుగుపడేలా ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ తన వంతు కృషి కొనసాగిస్తోందని యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి సబీనా ఇంద్రజిత్ తెలిపారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ కార్యవర్గ సమావేశాలు బుధవారం నాడు మంగళగిరి హ్యాపీ రిసార్ట్స్ లో ప్రారంభమయ్యాయి. ఐజెయు ప్రధాన కార్యదర్శి సబీనా ఇంద్రజిత్ జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాలను ప్రారంభించారు. అనంతరం ఐజెయు అధ్యక్షులు గీతార్థ పాఠక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో దేశ వ్యాప్తంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, జర్నలిస్టుల రక్షణకు తీసుకోవలసిన చర్యల గురించి చర్చించారు. విలువలతో కూడిన జర్నలిజం కోసం ప్రభుత్వాలు, జర్నలిస్ట్ సంఘాలు, మీడియా యాజమాన్యాలు సమిష్టి కృషి చేయాల్సిన ఆవశ్యకతపై సమావేశం విస్తృతంగా చర్చించింది. వర్కింగ్ జర్నలిస్టులకు నియామక పత్రాలు, గుర్తింపు కార్డులు, వేతనాలు ఇవ్వకుండా కొన్ని మీడియా యాజమాన్యాలు వ్యవహరిస్తున్న తీరుపై ఒడిషా,  ఛత్తీస్ ఘడ్, తమిళనాడు జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. జర్నలిస్టులకు  అమలవుతున్న కార్మిక, వేతన చట్టాలపై ఈ సందర్భంగా విస్తృత చర్చ జరిగింది. జర్నలిస్టులు సైతం నిష్పక్షపాతంగా వార్తలు అందించాల్సిన ఆవశ్యకతపై పలువురు వక్తలు సూచనలు చేశారు. వివిధ రాష్ట్రాల ప్రతినిధులు తమ రాష్ట్రాల్లో ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. ఆయా రాష్ట్రాల కార్యదర్శులు తమ కార్యకలాపాల నివేదికలు సమావేశం ముందుంచారు. జాతీయ స్థాయిలో ఐజెయులో చోటు చేసుకున్న సంస్థాగత సమస్యలను ప్రధాన కార్యదర్శి సబీనా ఇంద్రజిత్ వివరించారు.  గీతార్థ పాఠక్ అధ్యక్షతన ఐజెయు పటిష్టతకు వివిధ రాష్ట్రాలలో తీసుకుంటున్న చర్యలను ఆమె వివరించారు.    ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. డిల్లీబాబు రెడ్డి రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి తమ ఫెడరేషన్ చేస్తున్న కృషిని వివరించారు. వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు, అక్రిడిటేషన్ కార్డుల జారీకి, సీనియర్, విశ్రాంత జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కోసం పోరాడుతున్నామని తెలిపారు. స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఎస్. వీరభద్రరావు సమావేశానికి స్వాగతం పలికారు.    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రుద్రరాజు వెంకటరామరాజు, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్  ప్రధాన కార్యదర్శి బోళ్ళ సతీష్ బాబు, అరుణాచలప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అధ్యక్షులు అమర్ సంగ్నూ, ఐజెయు జాతీయ కార్యవర్గ సభ్యులు ఆసిం భక్త్ సింగ్, శైలేష్ కుమార్ పాండే,  జర్నలిస్ట్ యూనియన్ ఆఫ్ అసోం ప్రధాన కార్యదర్శి ధరంజిత్ కుమార్ దాస్, కేరళ జర్నలిస్టుల యూనియన్ అధ్యక్షులు బషీర్ మదోలా, వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఎస్. పి. గౌర్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర కార్యదర్శి జహీర్ అహ్మద్ సిద్దిఖీ తదితరులు ప్రసంగించారు.