బంగారం ధర తగ్గింది...

న్యూఢిల్లీ : బంగారం ధర తగ్గింది. కరోనా ప్రభావం, రూపాయి క్షీణతల నేపధ్యంలో సోమవారం నాటికి అమాంతం పెరిగిపోయిన బంగారం ధర... మంగళవారం అంతే విచిత్రంగా దిగివచ్చింది. 


ఒక్కరోజే రూ. 954 తగ్గడంతో దేశ రాజధానిలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 43,549 కు పడిపోయింది. కిందటి సెషన్‌లో ఈ ధర రూ. 44,503 గా ఉంది. ఇక వెండి కూడా బంగారం దారిలోనే పయనించింది. రూ. 80 తగ్గడంతో కిలో వెండి ధర రూ. 49,990 పలికింది.


అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడంతోపాటు డాలర్‌తో పోలిస్తే భారత కరెన్సీ రూపాయి విలువ బలంగా పుంజుకోవడంతో బంగారం, వెండి ధరలు తగ్గినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ తపన్‌ పటేల్‌ పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో మంగళవారం నాడు ఔన్సు బంగారం ధర 1,648 డాలర్లు, ఔన్సు వెండి ధర 18.40 డాలర్లు పలికింది.


కరోనా వైరస్‌పై ఆందోళనలు తగ్గుముఖం పడుతున్న వేళ ప్రపంచ మార్కెట్లు పుంజుకుంటున్నాయి. ఫలితంగా బంగారంలో పెట్టుబడులు తగ్గినట్లు మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.